చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రచంచాన్ని వణికించింది. ఇది కాస్త శాంతించే సమయానికి బ్రిటన్‌లో కరోనా కొత్త రూపం సంతరించుకుని, కరోనా స్ట్రెయిన్‌గా మారింది. ఇది ప్రతి ఒక్కరినీ బ్రిటన్‌లో స్ట్రెయిన్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా సౌతాఫ్రికాలో మరో కొత్త రకం కరోనా వెలుగులోకి వచ్చింది. దీనికి '501 డాట్ వీ2' అని పేరు పెట్టగా, యూకే వైరస్ కన్నా ఇది మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇదేసమయంలో ప్రస్తుతమున్న వ్యాక్సిన్‌లను ఈ వైరస్ ఎదుర్కొంటుందని వెల్లడించారు.
ఇదే విషయాన్ని స్పష్టం చేసిన బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మట్ హాన్ కాక్, 501 డాట్ వీ2 మరింత వేగంగానూ విస్తరిస్తోందని, అందువల్లే సౌతాఫ్రికా నుంచి యూకేకు అన్ని విమానాలనూ రద్దు చేశామని వెల్లడించారు.
కాగా, ఈ కొత్త వైరస్‌ను సౌతాఫ్రికాలోని క్రిస్ప్ (క్వాజులా - నాటాల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్ ఫామ్) జీనోమ్ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. డిసెంబర్ 18న కొత్త వైరస్‌ను తొలిసారిగా గమనించిన ఈ బృందం, ఆపై మరిన్ని పరిశోధనలు సాగించింది. అనారోగ్యం బారిన పడిన వారి నమూనాలను స్థానిక రీసెర్చర్లు సేకరించి, కొత్త వైరస్ జాడను గుర్తించారు.
2019 చివర్లో వెలుగులోకి వచ్చిన కరోనాతో పోలిస్తే, ఇది మరింత వేగంగా విస్తరిస్తోందని, శరీరానికి మరింత హాని కలిగిస్తోందని, యువతకు అధికంగా సోకుతోందని, ప్రస్తుతం కనీసం రెండు నుంచి మూడు జన్యు పరివర్తన చెందిన కరోనా వైరస్‌లు వ్యాపిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సౌతాఫ్రికా వైరస్ ఇంకా బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించడం లేదని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ప్రతినిధి డాక్టర్ ఎరిక్ లియాంగ్ ఫైగల్ తెలిపారు.