కరోనా వైరస్ టెస్ట్ చేసే స్వాబ్ ధర ఎంతో తెలుసా?

సోమవారం, 18 మే 2020 (18:55 IST)
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మూలాన ఏర్పడిన స్వాబ్‌ల కొరతను భారత్ అధిగమించింది. ప్రస్తుతం చైనా నుండి దిగుమతి చేసిన ఒక్కొక్క స్వాబ్ ధర 17 రూపాయలు కాగా భారత్‌లో 1.7 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయి. కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ముక్కు, గొంతు నుండి స్వాబ్‌లను ఉపయోగించి నమూనాలను సేకరిస్తారు. 
 
వీటికి కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ జాన్సన్ అండ్ జాన్సన్, రిలయన్స్ పరిశ్రమలను సంప్రదించింది. వీరు లాభాపేక్ష లేకుండా వాటిని తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ దానికి అవసరమయ్యే పాలీఈస్టర్‌ని సమకూర్చగా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఇయర్ బడ్‌లను తయారు చేసి ఇచ్చే ఆది ఎంటర్‌ప్రైజస్‌కి ఆ ముడిపదార్థం అందజేయడం జరిగింది.
 
ఈ నెల 6వ తేదీ నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా తయారీకి సిద్ధం అయింది. ఆది సంస్థ ప్రస్తుతం రోజుకు లక్ష స్వాబ్‌లను తయారు చేస్తోంది. దీని కోసం మరికొన్ని యంత్రాలను దిగుమతి చేసుకుని రోజుకు 5-6 లక్షలకు ఉత్పత్తిని పెంచుతామని పేర్కొంది. అప్పుడు ఒక్కొక్క స్వాబ్ రూపాయకే అందుబాటులోకి వస్తుందని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు