మహిళా క్రికెటర్లకు ఐసీసీ శుభవార్త.. టీ20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ రూ.19 కోట్లు

ఠాగూర్

బుధవారం, 18 సెప్టెంబరు 2024 (09:58 IST)
మహిళా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. ఇకపై క్రికెట్‌లో పురుషులతో సమానంగా మహిళలకు కూడా ప్రైజ్‌మనీని అందించనుంది. ముఖ్యంగా, వరల్డ్ కప్‌లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది. వచ్చే నెల మూడో నుంచి 20వ తేదీ వరకు యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 మహిళా వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ పోటీల్లో అందించే ప్రైజ్‌మనీని రూ.19.60 కోట్లకు పెంచింది. 
 
ఇదే టోర్నీలో క్రితంసారి చాంపియన్ నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు రూ.8 కోట్లు మాత్రమే దక్కడం గమనార్హం. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రకటించిన నగదు బహమతి 134 శాతం అధికం కావడం విశేషం. రన్నరప్ జట్టుకు రూ.9 కోట్ల నగదు లభిస్తుంది. అలాగే మొత్తం ప్రైజ్‌మనీ గతం కన్నా 25 శాతం ఎక్కువగా అంటే... రూ.66 కోట్లుగా ఉండబోతోంది. 
 
పురుషుల క్రికెట్‌కు సరిసమానంగా మహిళల క్రికెట్లోనూ ప్రైజ్‌మనీ ఉంటుందని గతంలోనే ఐసీసీ ప్రకటించింది. దీనికి తగ్గట్టుగానే మంగళవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ యేడాది జూన్ నెలలో విజేతగా నిలిచిన రోహిత్ సేనకు కాస్త అధికంగా రూ.20 కోట్ల 53 లక్షలు దక్కాయి. ఎందుకంటే పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో 20 జట్లు ఉండగా మ్యాచ్‌లు ఎక్కువగా జరిగాయి. మహిళల మెగా టోర్నీలో 10 టీమ్స్ మాత్రమే ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు