విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు.. అదే టర్నింగ్ పాయింట్ (video)

గురువారం, 19 సెప్టెంబరు 2019 (12:11 IST)
సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్‌), ఓపెనర్ శిఖర్ ధావన్‌ (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 40)తో రాణించడంతో భారత్ లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాదు.. అద్భుత ఫీల్డింగ్ కూడా చేసి ఔరా అనిపించాడు.
 
ఓపెనర్ హెండ్రిక్స్‌ (6) పెవిలియన్ చేరినా.. బవుమా (43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 49)తో కలిసి సౌతాఫ్రికా కెప్టెన్ క్వింటన్‌ డికాక్‌ (37 బంతుల్లో 8 ఫోర్లతో 52) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ధాటిగా పరుగులు చేసాడు. ఈ జోడి అప్పటికే ప్రమాదకరంగా మారింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో పేసర్ నవదీప్ సైనీ వేసిన ఆఫ్‌ కట్టర్‌ను డికాక్‌ భారీ షాట్ ఆడాడు.
 
బంతి కాస్తా గాల్లోకి లేవడంతో మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్ కోహ్లీ చిరుతలా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు.  ఈ క్యాచ్‌తో 57 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి కూడా తెరపడింది.
 
ఈ క్యాచ్ టీమిండియాకు టర్నింగ్‌ పాయింట్‌ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు