స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం రాత్రి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిపోయింది. ఈ విజయంతో భారత్ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. పాయింట్లపరంగా ఆగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాను భారత్ వెనక్కి నెట్టేసింది.
మరోవైపు, ఆరు మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్కటే విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు టేబుల్ అట్టడుగున నిలిచింది. భారత్ నిర్ధేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేదించలేక ఇంగ్లండ్ చతికిలపడి కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయింది. అయినప్పటికీ ఆ జట్టుకు సాంకేతికగా ఇంకా సెమీ ఫైనల్ అవకాశాలు ఉన్నాయి.
ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు మరో మూడు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. ఈ మూడింటిలో మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓడితే మాత్రం బ్రిటిష్ జట్టు మూటముల్లె సర్దుకుని స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి వుంటుంది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో భారీ రన్‌రేట్‌తో విజయాలు సాధిస్తే మాత్రం నాకౌట్ ఆశలు సజీవనంగా ఉంటాయి.
మరోవైపు, ఆరు మ్యాచ్‌లలో భారత్ 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించడంతో అగ్రస్థానంమలో ఉన్న సౌతాఫ్రికా రెండో స్థానానికి పడిపోగా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, శ్రీలంక - ఆప్ఘనిస్తాన్ మధ్య సోమవారం పూణె వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సమీ ఫైనల్ రేసులోకి వస్తుంది.