16 యేళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 యేళ్ల వృద్ధుడు...

ఠాగూర్

మంగళవారం, 27 మే 2025 (13:06 IST)
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో దారుణం జరిగింది. 16 యేళ్ళ మైనర్ బాలికను 60 యేళ్ల వృద్ధుడు బలవంతంగా పెళ్ళిచేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు ఆ బాలికను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అతని భార్య రెండేళ్ల కిందట మృతి చెందింది. అతనికి పెళ్లైన కుమారుడు, పెళ్లి కావాల్సిన కుమార్తె ఉన్నారు. రెండో వివాహం చేసుకోవాలని గత నెలలో బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను అడిగాడు. అందుకు వారు ససేమిరా అన్నారు. వారిని బెదిరించి మరీ ఇంటి బయటే బాలికకు తాళి కట్టాడు. మరుసటి రోజు బలవంతంగా కాపురానికి తీసుకెళ్లాడు. 
 
పెళ్లి ఇష్టం లేని బాలిక వారంలోపే పుట్టింటికి చేరింది. ఈ నెల 24న రామాంజనేయులు తన బంధువులతో బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, తండ్రి, అక్కపై దాడి చేశాడు. బాలికను బలవంతంగా ఓ వాహనంలో ఎత్తుకెళ్లి, రెండు రోజులపాటు ఇష్టారాజ్యంగా కొట్టాడు. దెబ్బలు భరించలేని బాధితురాలు ఆదివారం రాత్రి తప్పించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. అర్ధరాత్రి ఒంటరిగా పొలాల వెంబడి నడుచుకుంటూ వచ్చి ఓ చోట నిద్రించింది. సోమవారం ఉదయం స్థానికుల సాయంతో అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు