ఎలాగైనా పదవి కాలం పొడిగించుకుంటాం - టిటిడి ఛైర్మన్

ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (12:58 IST)
సరిగ్గా నెలరోజులు. టిటిడి పాలకమండలికి సమయం దగ్గరపడింది. సంవత్సరం మాత్రమే మొదట్లో అవకాశం ఇచ్చిన చంద్రబాబునాయుడు ఆ తర్వాత మరో యేడాది పొడిగించాడు. ఇక ఆ సమయం కాస్త అయిపోయింది. ఇక చదలవాడ తన పదవీ కాలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ ఆ పదవి కాలాన్ని పెంచడం సాధ్యం కాదన్నది ఆయనకే తెలుసు. మరో ప్రయత్నం చేసుకుంటే తప్పేముందంటున్నారు చదలవాడ. అందుకే తనకు తెలిసిన పరిచయాలతో ముందుకు వెళుతున్నాడు.
 
ప్రధానంగా నారా లోకేష్‌. లోకేష్‌తో చదలవాడకు ఉన్న పరిచయాలతో బాబుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగలేదు. మరికొంతమంది తెదేపా నేతలతో చంద్రబాబుకు చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తెలిసిన వారితో తిరిగి పదవీ కాలాన్ని పొడిగించుకునే ప్రయత్నం చేసుకుంటున్నాడు చదలవాడ కృష్ణమూర్తి. తిరుమల స్వామివారి ప్రసాదాలను తీసుకెళ్ళి తెదేపా సీనియర్ నేతలను మచ్చిక చేసుకుని వారి నుంచి బాబుకు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు చదలవాడ. 
 
అయితే ఈ సారి పదవీ కాలంతో ఈ బోర్డును రద్దు చేసి కొత్త వారిని తీసుకోవాలని నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారట. కొత్త పాలకమండలికి ఛైర్మన్ ఎవరన్నది కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో చదలవాడ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి