శ్రీవారి హుండీలో అన్నీ పాత నోట్లే - రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం...!

శుక్రవారం, 18 నవంబరు 2016 (11:41 IST)
పెద్ద నోట్ల రద్దు కాస్త శ్రీవారి హుండీ ఆదాయానికి బాగా కలిసొచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ లేకున్నా అనూహ్యంగా హుండీ ఆదాయం మాత్రం ఒక్కసారిగా పెరిగింది. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా ఒక్కరోజే నాలుగు కోట్ల రూపాయలు. గురువారం ఒక్కరోజే ఇంత మొత్తంలో హుండీ ఆదాయం రావడం తితిదేని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా ఉన్నా సరే హుండీ ఆదాయం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 
 
ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాదిగా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ప్రతిరోజు 50 వేలకుపై మాటే భక్తులు తిరుమలకు వస్తారు. ఇక హుండీ ఆదాయం గురించి చెప్పాలంటే ప్రతిరోజు ఒకటిన్నర కోటి.. రద్దీ సమయంలో అయితే రెండున్నర కోట్ల రూపాయలు వస్తుంది. కానీ పాత నోట్లను రద్దు చేస్తూ 8 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడంతో పాత నోట్లన్నీ హుండీకి చేరిపోయాయి. 
 
గురువారం ఒక్కరోజే 3 కోట్ల రూపాయలకుపైగా పాతనోట్లను తితిదే అధికారులు గుర్తించారు. అందులో ఒక కోటి రూపాయలు మాత్రమే వంద, 50, 20, 10 రూపాయల నోట్లు. దాంతో పాటు కొత్త 2 వేల రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. మిగిలిన 3కోట్లు పాత వెయ్యి, 500 రూపాయల నోట్లు మాత్రమేనట. అది పరిస్థితి.
 
గురువారం ఉదయం నుంచి తిరుమలలో రద్దీ అసలు కనిపించలేదు. సర్వదర్సనం క్యూలైన్లన్నీ ఖాళీగా బోసిపోయి కనిపించాయి. ఇక వీఐపీలు మాత్రమే ఉదయాన్నే దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక చెప్పనవసరం లేదు. తితిదే అధికారులే కంపార్టుమెంట్లలో కనిపించారు. స్వామివారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌. ఇది పరిస్థితి. ఇదంతా గమనించిన తితిదే అధికారులు హుండీ ఆదాయం బాగా తగ్గే అవకాశం ఉందని అనుకున్నారు. 
 
అయితే వారు అనుకున్నది పొరపాటే. హుండీ ఆదాయం గతంలో లేనంతగా రికార్డు స్థాయి. ఏకంగా 4 కోట్లు. అయితే పాతనోట్లను మార్చుకునే అవకాశం తితిదేకి ఉండడంతో ఈ 3కోట్ల రూపాయలు ఈజీగా మారిపోయే అవకాశముంది. ఇదంతా పక్కన ఉంచితే పాత నోట్ల ప్రభావం అటు శ్రీవారి భక్తులకు మొక్కులు తీర్చుతుంటే మరోవైపు తితిదే ఆదాయం మరింత పెరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి