అయ్యా... మీరు ఒకే అనండి.. రెచ్చిపోతానంటున్న తమిళ నేత ఎవరు?

సోమవారం, 12 జూన్ 2017 (14:55 IST)
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్ చుట్టూనే తిరుగుతున్నాయి. జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన దినకరన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ రాజకీయాల వైపు మళ్ళాడు. అన్నాడిఎంకేలో తనకున్న పట్టుతో మళ్ళీ చక్రం తిప్పాలన్నదే దినకరన్ ఆలోచన. దినకరన్ తమిళనాడుకు సీఎం అవ్వాలన్న కోరిక ఇప్పటిది కాదు. అత్తతో కలిసి దినకరన్ ఎప్పుడో ఈ ప్లాన్ వేశాడు. శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత ఆర్కే నగర్ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా సిఎం అవ్వాలన్న ఉద్దేశంతోనే పావులు కదిపాడు.
 
అయితే చివరకు ఆ ఎన్నికలే దినకరన్‌కు పెద్ద చిక్కుల్లో నెట్టి జైలుకు వెళ్ళేలా చేశాయి. దినకరన్ జైలుకు వెళ్ళిన వెంటనే ఇక అన్నాడిఎంకేలో పెద్దగా గొడవలు ఏమీ ఉండవు.. అంతా సర్ధుకుంటుందని అందరూ అనుకున్నారు. కొన్నిరోజుల వరకు బాగానే ఉంది. అయితే దినకరన్ బయటకు రావడం వేగంగా పావులు కదిపి మళ్ళీ మొదటికి రావడం అంతా జరిగిపోతున్నాయి. ఇప్పటికే రహస్యంగా అన్నాడిఎంకేలోని 25 ఎమ్మెల్యేలతో సమావేశమైన దినకరన్ ఆ తర్వాత ఏకంగా ఢిల్లీకి వెళ్ళి బిజెపి అగ్రనేతలను కలిశాడు. 
 
అయ్యా... మీరు ఆర్డరివ్వండి.. మీ అండదండలతో రెచ్చిపోతా.. మీరు చెప్పినట్లే చేస్తానంటూ బీజేపీ అగ్రనేతల ముందు మోకరిల్లాడట.. అయితే బీజేపీ నాయకులు మాత్రం దినకరన్‌కు ఏమీ చెప్పలేదట. కానీ దినకరన్ మాత్రం ఢిల్లీలోనే ఉండి ఎలాగైనా ప్రధానమంత్రిని కలిసి తమిళనాడు రాజకీయాలను శాసించాలన్న ఆలోచనలో ఉన్నారట. 

వెబ్దునియా పై చదవండి