భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు(సొంతూరు వీడియో)
శనివారం, 5 ఆగస్టు 2017 (19:33 IST)
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎం. వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించారు. యూపీఎ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై ఆయన విజయం సాధించారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 771. వీటిలో 11 ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడుకి మొదటి ప్రాధామ్యం ఓట్లు 516 రాగా గోపాలకృష్ణ గాంధీకి 244 వచ్చాయి. దీనితో వెంకయ్య నాయుడు విజయం ఖాయమైంది.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంకితభావానికి ఆయన నిలువెత్తు రూపం. అరుదైన భాషా నైపుణ్యంతో మూడు భాషల్లో ప్రాసలను ఉపయోగించే అద్భుత నైపుణ్యంతో ప్రత్యర్థులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేసే మాటల చమత్కారంతో జీవితాన్ని పండించుకున్న మన వెంకయ్య నాయుడికి రాజ్యాభిషేకం ఖాయమైంది. రాజ్యాంగబద్ధ పదవుల్లో దేశంలోనే రెండో అత్యున్నత స్థానానికి చాలాకాలానికి ఒక తెలుగువాడు చేరుకోవడం అందరికీ గర్వకారణం.
తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ముప్పవరపు వెంకయ్యనాయుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ పేరు సుపరిచితం. తెల్లటి చొక్కా, తెల్లటి పంచెతో దర్శనమిచ్చే 6 అడుగుల మాటల బుల్లెట్ వెంకయ్య నాయుడు. బీజేపీ జాతీయ నేతలు... అటల్జీ, అద్వానీజీ, ప్రమోద్ మహాజన్, సుష్మాస్వరాజ్, నరేంద్రమోదీ, అరుణ్ జైట్లీ ఇలా సీనియర్లందరూ వెంకయ్యాజీ అని పిలిచే సమున్నత వ్యక్తిత్వం ఆయనది. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జిగా, బీజేపీ జాతీయ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా ఇలా అనేక బాధ్యతల్లో వెంకయ్య ఒదిగిపోయారు.
ఎన్డీఏ ప్రభుత్వాల్లో తనదైన శైలితో ఒక ప్రత్యేక ముద్రతో కార్యకర్తలను, ప్రజలను, ఆకట్టుకోవడంలో వెంకయ్యది ప్రత్యేక స్టైల్. మాటల తూటాలతో దక్షిణాది రాష్ట్రాల్లోనే కాక, బిహార్, ఉత్తరప్రదేశ్, కేరళ, మిజోరామ్, జమ్మూ కశ్మీర్ ఇలా దేశ వ్యాప్తంగా అనేక పార్టీ బహిరంగ సభల్లో పార్టీ వాణి–బాణిని బలంగా విన్పించారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రత్యర్థి పార్టీలకు వేడి పుట్టించే ప్రసంగాలకు వెంకయ్య పెట్టింది పేరు.
విభజన సమయంలో వెంకయ్య పోషించిన పాత్ర అనన్య సామాన్యం. ఓవైపు సొంత పార్టీ నేతలు, మోదీ, జైట్లీ, సుష్మా, అద్వానీలకు విభజన బిల్లులో లోపాలను వివరిస్తూ... మరోవైపు అధికార పక్షంతో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, కావాల్సిన సంస్థలు, రావాల్సిన నిధులు, పోలవరం ముంపు మండలాల విషయాలపై చర్చించారు. 3 నెలల సమయాన్ని విభజన చర్చల కోసం వెచ్చించడం చాలామందికి తెలియని విషయం.
మూడు భాషల్లో అనర్గళ వాగ్ధాటి, వాజ్‌పేయి కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేయడం జాతీయ రాజకీయాల్లో వెంకయ్య నిలదొక్కుకోవడానికి ఉపకరించింది బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ వర్గీయుడిగా ముద్ర ఉన్నా, 2013 నాటి బీజేపీ అంతర్గత పోరులో పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించి మోదీకి మద్దతివ్వడం వెంకయ్యకు కలిసొచ్చింది. ప్రభుత్వంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరొందిన ఆయనకు 2014లో మళ్లీ కేంద్ర కేబినెట్‌లో కీలక శాఖలు దక్కాయి.
ఒక దశలో రాష్ట్రపతి పదవికి ఆయన పేరు పరిశీలనలో ఉందనే వార్తలూ వినిపించాయి. దీనిపై ఆయన చమత్కారంగా స్పందిస్తూ.. తనకు ‘ఉషాపతి’గానే ఉండటం ఇష్టమమని భార్య పేరును ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి పదవి గురించి ప్రస్తావించగా, ‘ప్రజల మధ్య ఉండడమే నాకిష్టం. అలంకార ప్రాయమైన ఉపరాష్ట్రపతి పదవిపై ఆశ లేదు’ అని అన్నారు.
నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పుట్టిన వెంకయ్య 40 ఏళ్ల ప్రస్థానం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 30 అబ్దుల్ కలామ్ రోడ్డు నుంచి ఉపరాష్ట్రపతి భవనానికి మారబోతోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వెంకయ్య... ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పీఠాన్ని అధిరోహించేందుకు రంగం సిద్ధమైంది. కాకలు తీరిని రాజకీయ నేతల వేదికగా ఉండే రాజ్యసభలో మోదీ స్టైల్‌లో నడిపించాలంటే అందుకు వెంకయ్యే తగినవాడన్న అభిప్రాయం మోదీలో ఉంది. అందుకే ప్రభుత్వానికి తల్లోనాలుకలా వ్యవహరించిన వెంకయ్యను బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. వెంకయ్యకు పట్టాభిషేకం.. చాలాకాలం తర్వాత తెలుగువాడికి మళ్లీ దక్కిన గౌరవ పురస్కారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు శుభాకాంక్షలు.