మాజీమంత్రి, మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్థసారధి టీవీ ఛానళ్లపై మండిపడ్డారు. పత్రికా విలువలను తుంగలో తొక్కి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బస చేసిన హోటల్ గదిలో పెద్దఎత్తున డబ్బు పట్టుబడిందనీ, కొంత డబ్బును ముందుగానే తరలించివేశానంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు.
దీనిపై ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... తనపై అవాస్తవ కథనాలను ప్రసారం చేస్తున్న టీవీ ఛానెళ్లపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పోలీసులు జరిపిన సోదాల్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదనీ, బీసీకి చెందిన వాడిని కనుకనే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఐతే తానున్న హోటల్ లోనే బస చేసిన తెదేపా నాయకులు డబ్బు సంచులతో బయటికెళుతుంటే అవేమీ కనబడటం లేదా అంటూ మండిపడ్డారు.