నరేంద్ర మోడీనో, ఎల్లయ్యో, పుల్లయ్యో ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే... జగన్
బుధవారం, 7 మే 2014 (19:24 IST)
WD
2014 ఎన్నికల్లో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన ఓటింగ్ అంతా ఏకపక్షంగా ఉంటుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించే నరేంద్ర మోడీనో కాదంటే ఏ ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరయినా మన వద్దకు రావాల్సిన పరిస్థితిని సీమాంధ్ర ప్రజలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పన్నినా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ప్రజలంతా ఓ కెరటంలా లేచి ఉప్పెనలా ఓటింగులో పాల్గొన్నారన్నారు. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించిందనీ, దానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దారుణ వైఖరిని తెలుగుదేశం, భాజపాలు మద్దతు ఇచ్చాయని, అందువల్ల ఆ పార్టీలను కూడా ప్రజలు క్షమించరనీ, గట్టిగా ఓ కెరటంలా లేచి తమ తీర్పును ఇచ్చారని అన్నారు.