అలుపెరుగని ప్రచార సారథి నరేంద్ర మోడీ : ప్రపంచ రికార్డు!!
గురువారం, 1 మే 2014 (11:15 IST)
File
FILE
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అలుపెరుగని ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు పూర్తి బాధ్యతలను తన భుజాలపై వేసుకుని దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈ అలుపెరుగని ప్రచారకుడు తన ప్రచారంలో రికార్డును నమోదు చేయబోతున్నారు. గతేడాది సెప్టెంబర్ 15వ తేదీన నరేంద్ర మోడీని పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అప్పటి నుంచి ఆయన విస్తృత స్థాయిలో పర్యటిస్తూనే ఉన్నారు. తొలుత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత లోక్‌సభ ఎన్నికల కోసం ఆయన తన ప్రచారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తున్నారు.
మే 12వ తేదీన జరిగే చివరి దశ పోలింగ్ ప్రచారం ముగిసే 10వ తేదీ లోపు మోడీ మొత్తం 437 బహిరంగ సభల్లో ప్రసంగించిన నేతగా రికార్డులకు ఎక్కనున్నారు. అలాగే మూడు లక్షల కిలోమీటర్ల దూరం పర్యటించిన నేతగానూ ఘనత సొంతం చేసుకోనున్నారు. దీనికితోడు 3డీ టెక్నాలజీ ద్వారా 1,350 సభల్లోనూ ఆయన ప్రసంగాలు పూర్తికానున్నాయి. ఇలా మొత్తం 5,983 కార్యక్రమాలలో మోడీ పాల్గొని సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారని బీజేపీ వెల్లడించింది.