నా భర్త వాద్రాను టార్గెట్ చేయడం బాధిస్తోంది : ప్రియాంకా

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (16:12 IST)
File
FILE
తన భర్త రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేసుకుని విపక్షాలు దాడి చేయడం బాధిస్తోందని కాంగ్రెస్ నేత, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొలేని వారు వాద్రాను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడం తనను వేదనకు గురిచేస్తోందన్నారు.

రాయ్‌బరేలిలో తల్లి సోనియా గాంధీ తరుపున ప్రచారం చేపట్టిన ఆమె.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. వారికి అభివృద్ధిపై మాట్లాడటం తెలీదన్నారు. ఎన్నికల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ఆ నేతలు తన భర్తను తెరపైకి తీసుకురావడం రాజకీయ కుట్రలో భాగమేనని ప్రియాంక తెలిపారు.

అయినప్పటికీ ప్రత్యర్థులపై పోరాడతానన్నారు. చాలా పరుషమైన పదాలు మా కుంటుం, నా భర్త విషయంలో వాడారు. మా కుటుంబాన్ని అవమానించాలని చూస్తున్నారు. ఇది చాలా బాధాకరం. కానీ వీటిని ఎలా తట్టుకోవాలో నాయనమ్మ ఇందిర వద్ద నేర్చుకున్నా అంటూ ప్రియాంకాగాంధీ చెప్పారు.

ఈ మేరకు ఆమె రాయ్ బరేలీలో మంగళవారం మాట్లాడారు. నా భర్తను అపఖ్యాతి పాల్జేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. తమను అపఖ్యాతి పాల్జేయాలనుకుంటే తన నుంచి గట్టి స్పందన ఎదురవుతుందని రాజకీయ ప్రత్యర్థులను హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి