సోనియా ఆస్తి : 2009లో రూ.1.37 కోట్లు.. 2014లో రూ.9.69 కోట్లు!!
గురువారం, 3 ఏప్రియల్ 2014 (12:10 IST)
File
FILE
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్తులు కేవలం ఐదేళ్ళలో ఆరు రెట్లు పెరిగినట్టు ఆమె బుధవారం రాయ్ బరేలి లోక్సభ స్థానం ఎన్నికల నిర్వహణాధికారికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. సొంత కారు లేకపోవడం, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి రూ.9 లక్షలు అప్పు ఇచ్చినట్టు ఆమె పేర్కొనడం గమనార్హం.
అయితే, గత 2009లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో సోనియా గాంధీ ఆస్తి విలువ కేవలం రూ.1.37 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ తాజా అఫిడవిట్లో ఆమె ఆస్తులు రూ.9.69 కోట్లుగా ఉన్నట్టూ చూపారు. గతంతో పోల్చితే ఆమె ఆస్తుల విలువ ఇపుడు ఆరు రెట్లు పెరగడం గమనార్హం.
ఈ ఆస్తుల్లో సోనియా వద్ద 85 వేల నగదు మాత్రమే ఉండగా, 9 లక్షల అప్పును చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్లలో 66 లక్షల రూపాయలు, వారసత్వంగా లభించిన 23 లక్షల రూపాయల విలువైన బంగారు అభరణాలు ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు. సోనియా వద్ద 12 లక్షల మ్యూచ్ వల్ ఫండ్స్, కొన్ని కంపెనీల షేర్లు కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు.
అంతేకాకుండా తన వద్ద 1.267 కేజిల బంగారం, 88 కేజీల వెండి ఉన్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో 2.5 కిలోల బంగారం ఉన్నట్టు సోనియా తెలిపారు. ఢిల్లీకి సమీపంలోని సుల్తాన్ పూర్, దేరా మండి గ్రామంలో 4.86 కోట్ల విలువైన 3.21 ఎకరాల భూమి ఉన్నట్టు సోనియా తెలిపారు.