వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వ ఎన్డీయే కూటమికి 300 సీట్లు ఇస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా, దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే ఓటర్లు విస్పష్ట తీర్పునివ్వాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో మోడీ ఎన్నికల సమర శంఖం పూరించారు. అక్కడ మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి రాకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వారికి దేశ అభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని విమర్శించారు.
బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు కుయుక్తులతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. సుస్థిర ప్రభుత్వంతోనే అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు రెట్టింపవుతాయని ఆయన చెప్పారు.
కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడకూడదని కాంగ్రెస్ కోరుకుంటోంది. అది దేశభక్తి కాదు. ఎవరు ఏర్పాటు చేసినా సుస్థిర ప్రభుత్వం ఉండాల్సిందే. దేశం విచ్ఛిన్నం కావాలని మాత్రం చూడకూడదన్నారు. తనకు అవకాశం రాకపోతే ఎదుటివారిని కూడా చెడగొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.