వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను బీజేపీ మహిళా సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, ఉమా భారతిలు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులోభాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ లోక్‌సభ స్థానానికి సుష్మా స్వరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ఉన్నారు.
అలాగే, ఫైర్ బ్రాండ్, బీజేపీ నేత ఉమాభారతి ఇవాళ ఝాన్సీ పార్లమెంటరీ నియోజకవర్గంలో నామివేషన్ వేశారు. ఏప్రిల్ 30న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. తన మద్దతుదారులతో కలెక్టరేట్‌కు చేరుకున్న ఉమా భారతి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే రవిశర్మ, మాజీ మంత్రి రవీంద్ర శుక్లా తదితరులున్నారు.