పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించింది. ముఖ్యంగా బ్యాంకులు, ఏటీఎంలలో విత్ డ్రా పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో వారానికి రూ.20 వేల విత్ డ్రా పరిమితిని 24 వేలకు పెంచింది. రోజుకు పదివేలే తీసుకోవాలన్న నిబంధనను తొలగించింది. ఏటీఎంలలోనూ విత్ డ్రా పరిమితిని రూ.2 వేల నుంచి రూ.2500 వరకు పెంచింది.
మరోవైపు పెద్దనోట్ల రద్దుతో కొత్త నోట్లను తీసుకోవడానికి దేశ వ్యాప్తంగా బ్యాంకుల ముందు గంటల తరబడి ఎదురుచూస్తున్నప్పటికీ కొందరు ఖాతాదారులకి నగదు అందని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు బ్యాంకుల సిబ్బంది ఓవర్ టైమ్ చేస్తూ ఖాతాదారులకు సేవలు అందించారు. రెండో శనివారంతో పాటు ఈ రోజు కూడా బ్యాంకులు పనిచేశాయి. అయినప్పటికీ ఎంతో మంది ప్రజలకు కొత్త నోట్లు అందలేదు. మరోవైపు కొన్ని చోట్ల ఏటీఎంలు మొరాయించడం, కొన్ని ప్రాంతాల్లో అసలు తెరచుకోకపోవడం గమనార్హం.