వదల బొమ్మాళీ అంటున్న నోట్ల రద్దు భూతం.. ఖాళీ ఏటీఎంలతో బేర్‌మంటున్న జనం..

శనివారం, 11 మార్చి 2017 (05:53 IST)
పెద్ద నోట్ల రద్దు భూతం మళ్లీ దేశం మీద పడింది. అది ఏటీఎంలలో దూరింది. దెబ్బకు వాటిలోని డబ్బు మాయం. నోట్ల రద్దు జరిగి 120 రోజులు  పూర్తయినా సామాన్యుడి డబ్బు వ్యథలు తీరటం లేదు. జనం మళ్లీ రోడ్డెక్కటం మొదలెట్టారు. ఏటీఎంలకు మళ్లీ డబ్బులేని జబ్బు చేసింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా డబ్బులు రాల్చేందుకు మొరాయిస్తున్నాయి. ఏ ఏటీఎం వద్ద చూసినా నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. గత 15 రోజులుగా పట్టుమని నాలుగు రోజులు కూడా రాష్ట్రంలోని ఒక్క ఏటీఎం డబ్బులతో కళకళలాడిన దాఖలాల్లేవు. పెద్ద నోట్ల రద్దయినప్పుడు ఉన్న వాతావరణమే మళ్లీ పునరావృతమవుతోంది.
 
శని, ఆది, సోమవారాల్లో వరుస సెలవులు రావడంతో నగదు కష్టాలు మరింత పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 10% ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవే అరకొర డబ్బులు విదులుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలు పూర్తిగా పడకేశాయి. పాలకొల్లులో ఏటీఎంలు నాలుగైదు రోజులుగా మూలనపడ్డాయి. రోజుకు రూ.50 వేలు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నా ఏటీఎంల్లో నగదు లేక అది సాధ్యం కావడం లేదు. పాలకొల్లులో ఆరు ఏటీఎంలు ఉంటే గురువారం ఒక్కటి పనిచేసింది. 
 
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంల్లోనూ అదే పరిస్థితి. రెండో శనివారం, ఆదివారం, హోలీతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ కట్టారు. అయితే బ్యాంకుల్లోనూ నగదు కొరత కారణంగా ఖాతాదారులకు అరకొరగా డబ్బులు చెల్లించారు. 
 
కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా పరిస్థితి దుర్భరంగా మారింది. 1వ తేదీ నుంచి బ్యాంకుల్లో పడిన జీతాలు తీసుకొనేందుకు ఏటీఎంల వద్దకు క్యూ కట్టిన ఉద్యోగులు వాటిలో నగదు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాలోని 90 శాతం ఏటీఎంలలో నగదు కొరత ఉందని బ్యాంకు అధికారులే స్పష్టం చేస్తున్నారు. డబ్బులు కోసం బ్యాంకుకు వెళితే రూ.50 వేలే ఇచ్చారని అవి కూడా చిల్లరనోట్లు (20, 10 రూపాయలు)ఇచ్చారని పాలకొల్లుకు చెందిన కొబ్బరి వ్యాపారి మాటూరి వీరవెంకట నరసింహమూర్తి తెలిపారు. తన వద్ద 350 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి రోజుకి రూ.300 చొప్పున లక్ష రూపాయల వరకు రోజువారీ వేతనం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 
 
ఇన్ని బాధలు పడుతున్న జనం ఓర్చకుంటూనే ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎన్నాళ్లిలా బతుకు సాగదీయటం.. డబ్బుకోసం పోరాటం ఎన్నాళ్లు సాగించాలి. ఇదీ భారతం. డబ్బు లేని భారతం. నోట్ల రద్దు భూతం బారినపడ్డ భారతం.
 

వెబ్దునియా పై చదవండి