పచ్చి బఠాణీలో పోషక నిల్వలు ఉన్న విషయం తెలియకుండానే ఎందరో భోజన ప్రియులు వీటిని ఇతర కూరగాయలతో ఉడికించుకుని తింటున్నారు. ఆలు, పన్నీర్, మటన్ ఇలా రకరకాల కూరల్లో, బిర్యానీలోనూ కలిపి వండడం బాగా పెరిగింది. బఠాణీ సూప్ కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతున్నారు.
పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సి, ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కంటి సమస్యలు, రక్తహీనత ఉండవు. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎదిగే పిల్లలకు పచ్చి బఠానీలను పెట్టాలి. ఇవి వారికి బలవర్దకమైన ఆహారంగా పనిచేస్తాయి. పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే వీటిని అతిగా మాత్రం తినడం వల్ల గ్యాస్ ఇబ్బంది కలుగుతుంది.