ఆస్ట్రేలియాలో వెలుగుచూసిన స్వైన్‌ఫ్లూ కేసు

ప్రపంచాన్ని కుదిపేస్తున్న స్వైన్‌ఫ్లూ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు సైతం విస్తరించింది. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న ఓ మహిళను గుర్తించడం ద్వారా ఆస్ట్రేలియా అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికాకు వెళ్లి తిరిగివచ్చిన సదరు మహిళకు నిర్వహించిన వైద్య పరీక్షలవల్ల ఈ విషయం బయటపడినట్లు అధికారులు తెలిపారు.

అధికారుల వివరాల ప్రకారం అమెరికాకు వెళ్లి ఆస్ట్రేలియాకు తిరిగివచ్చిన ఈ మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు శనివారంనాడజు వైద్యాధికారులు కనుగొన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. ఈ విషయమై ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ మంత్రి నికోలా రోక్సన్ మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న మహిళను తాము గుర్తించే సమయానికే ఆమె ఆ వైరస్ బారినుంచి దాదాపుగా బయటపడే దశలో ఉన్నట్టు తెలిపారు.

ఇదిలావుండగా ఆ మహిళ నర్సు కావడంతో అమెరికాలోనే ఆమె స్వైన్‌ఫ్లూ వ్యాధికి సంబంధించి చికిత్స చేయించుకున్నారని ఫ్లూ సమస్య దాదాపుగా తగ్గుముఖం పడుతున్న సమయంలో ఆస్ట్రేలియాకు చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ మహిళలో స్వైన్‌ఫ్లూ వైరస్ చాలా తక్కువ మొత్తంలోనే ఉందని, అందుకే వ్యాధి లక్షణాలు సైతం ఆమెలో తక్కువగానే ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఆ మహిళ ఆస్ట్రేలియాకు చేరుకున్న సమయంలో ఆమెతోపాటు ప్రయాణించిన వారినందరినీ పరీక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు.

అదేసమయంలో ఆస్ట్రేలియాకు చెందిన 567మందికి ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వీరిలో ఎవరికీ వ్యాధి ఉన్నట్టు తేలలేదని, అయితే 18మందికి సంబంధించిన వైద్య పరీక్షల వివరాలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి