పశ్చిమ చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 189 మంది మృతి చెందారని సోమవారం ఆ దేశ ప్రభుత్వ మీడియాలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ అల్లర్లలో 800 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల సంఖ్యపై మరే ఇతర వివరాలు వెల్లడించలేదు.
జిన్‌జియాంగ్ రాజధాని ఉరుంఖీలో ఓ ముస్లిం వర్గానికి చెందిన వెయ్యి మంది ఆందోళనకారులకు ఆదివారం అల్లర్లకు దిగారు. ఆందోళనకారులు సాధారణ పౌరులు, పోలీసులపై దాడులకు దిగారు. దీనికి సంబంధించి జరిగిన హింసాకాండలో నలుగురు వ్యక్తులే మృతి చెందారని మొదట జిన్‌హువా వెల్లడించింది. అయితే సోమవారం వచ్చిన వార్తల్లో మృతుల సంఖ్య 129కి పెరిగింది.
గత నెలలో దక్షిణ చైనాలోని ఓ కర్మాగారంలో ఉయ్‌ఘుర్స్, హాన్ చైనీస్ కార్మికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘర్షణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ తాజాగా ఉయ్‌ఘుర్ ముస్లిం వర్గం ఆందోళన చేపట్టింది. ఆందోళనకారులు అనేక కార్లకు నిప్పంటించారు. అంతేకాకుండా కొన్ని గంటలపాటు జరిగిన అల్లర్లలో వారు బస్సులపై దాడులు చేశారు.