పాకిస్థాన్ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న తాలిబన్ ఉగ్రవాదులతో పోరాడేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను జీ-8లో సభ్యత్వమున్న దేశాలన్నీ సమర్థించాయి. ఉగ్రవాదంపై పోరాడేందుకు జీ-8దేశాలన్నీ పాక్ దేశానికి సహాయ సహకారాలందిస్తాయని ఉద్ఘాటించాయి.
జీ-8 దేశాల సమావేశం జులై 8 నుంచి 10 వరకు ఇటలీలోని ఎల్‘అక్విలాలో జరుగుతోంది. ఈ సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ దేశంలో పెట్రేగిపోతున్న తీవ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్ తీసుకునే చర్యలన్నింటికి తమ దేశాలు మద్దతు తెలుపుతాయని జీ-8 దేశాలు ముక్త కంఠంతో తెలిపాయి.
గత కొద్ది నెలలుగా పాక్ ప్రభుత్వం ఆదేశంలోని వాయువ్య ప్రాంతంలో స్థావరాలను ఏర్పరచుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీవ్రంగా పోరాడుతోంది.
ఇదిలావుండగా ఆఫ్గనిస్థాన్ దేశంలో అధ్యక్షుని ఎన్నికలు సజావుగా, శాంతిపూర్వక వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలదై ఉండాలని జీ-8సభ్యత్వ దేశాలు అభిప్రాయపడ్డాయి.
కాగా ఆఫ్గనిస్థాన్‌లో అధ్యక్షుని ఎన్నికలు ఆగస్టు నెలలో జరుగాల్సివుంది. దీనికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ దేశాలు పేర్కొన్నాయి.