ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వస సభ్యత్వం కల్పించాలని బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తమ దేశం భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఇటలీలోని లాఅక్విలాలో జరుగుతున్న జీ-8 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం బ్రిటన్ ప్రధానితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శాశ్వత సభ్యత్వం కోసం బ్రిటన్ మద్దతును మన్మోహన్ మరోమారు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన గార్డెన్ బ్రౌన్.. మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశాన్ని మిగిలిన శాశ్వత దేశాలు పరిశీలించాలని ఆయన సూచించారు.
21వ శతాబ్దంలో భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని బ్రౌన్ అన్నారు. అంతకుముందు మన్మోహన్, బ్రౌన్లు సుమారు 45 నిమిషాల పాటు సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చల్లో వాణిజ్య, వ్యవసాయం, తీవ్రవాదం అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
ఇదిలావుండగా, జీ-8 సదస్సు జరుగుతున్న లాఅక్విలాలో గత ఏప్రిల్లో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మంది గాయపడ్డారు. సుమారు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు.