మత కలహాలను అణిచివేస్తాం: హూ

చైనాలోని జిన్‌జియాంగ్‌లో చెలరేగిన మత ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ కలహాల్లో 156 మంది మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయాల పాలైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా జీ-8 సదస్సులోపాల్గొన్న చైనా అధ్యక్షుడు హూ జింటావో పరిస్థితిని చక్కబెట్టేందుకు తన పర్యటనను అర్థాంతరంగా ముగించేసుకుని తిరిగి చైనాకు వచ్చేశారు. ఈ మతకలహాలను అణిచేస్తామని జింటావో శపథం చేశారు.

చైనాలో ఆయిల్‌ రిచ్‌గా పేరు పొందిన జిన్‌జియాంగ్‌లో హాన్స్‌ చైనీయులు, యుగ్యుర్‌ ముస్లింలు ఒకరికి ఒకరు ఏమాత్రం తీసిపోని రీతిలో రెచ్చిపోయి మత ఘర్షణలకు దిగడంతో చైనా ప్రభుత్వం ఆందోళనకు గురవుతోంది.

అత్యవసరంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించి ఈ మత ఘర్షణలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుని దేశ భద్రతకు లోటు కలగకుండా ఉండేందుకు, మత కలహాలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి