హసీనా జీవితకాల భద్రత బిల్లు ఆమోదం

బంగ్లాదేశ్ జాతిపిత, బంగ్లాబంధు షేక్ ముజిబూర్ రెహమాన్ కుటుంబసభ్యులకు జీవితకాల భద్రత కల్పించే బిల్లుకు సోమవారం ఆ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా కూడా ముజిబూర్ రెహమాన్ కుమార్తే. రెహమాన్ కుటుంబసభ్యులకు జీవితకాల భద్రత కల్పించే చట్టానికి బంగ్లాదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ఈ చట్టం పేరు జాతి కుటుంబసభ్యుల భద్రతా చట్టం- 2009. ఈ చట్టం కింద హసీనాతోపాటు, రెహమాన్ కుటుంబసభ్యులకు పటిష్ట భద్రత కల్పిస్తారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మీడియా కార్యదర్శి అబ్దుల్ కలాం ఆజాద్ విలేకరులతో చెప్పారు. ఇంతకుముందు షేక్ హసీనా, ఆమె చిన్న సోదరి షేక్ రెహనాలకు రక్షణ కల్పించేందుకు చట్టాన్ని రూపొందించారు.

బంగ్లాబంధుగా పేరొందిన రెహమాన్, ఆయన కుటుంబసభ్యుల్లో అనేక మంది ఆగస్టు 15, 1975 సైనిక తిరుగుబాటులో హత్య చేయబడ్డారు. ఆ సమయంలో రెహమాన్ స్థాపించిన అవామీ లీగ్ పార్టీ అధికారంలో ఉంది. తిరుగుబాటుతో బంగ్లాదేశ్ సైనికులు రెహమాన్, ఆయన కుటుంబసభ్యుల్లో చాలామందిని హత్య చేసి, ప్రభుత్వాన్ని కూల్చివేశారు. హసీనా, రెహనా విదేశాల్లో ఉండటంతో ఆనాటి మారణహోమం నుంచి బయటపడ్డారు.

వెబ్దునియా పై చదవండి