ప్రైవేటు కంపెనీలో ఒబామా ఉద్యోగం...? 1600 మంది ఉద్యోగుల్లో ఒకడిగా...?

మంగళవారం, 10 జనవరి 2017 (17:00 IST)
శ్వేతసౌధం పగ్గాలను వదిలేస్తున్న బరాక్ ఒబామాకు మంచి ఉద్యోగ అవకాశం. ఈ ఉద్యోగం తమవద్ద వున్నట్లు ప్రకటించింది స్పోటిఫై కంపెనీ. తాము ప్రకటించిన ఉద్యోగానికి కావలసిన అర్హతలను కూడా తెలిపింది. కనీసం 8 ఏళ్లపాటు ఏదేని దేశానికి అధ్యక్షుడుగా ఉండాలని తెలిపింది. అలాగే మంచి వాక్చాతుర్యం ఉండాలనీ, నోబెల్ శాంతి బహుమతి కూడా వారికి వచ్చి ఉండాలని వెల్లడించింది. ఇలా ఆ కంపెనీ పెట్టిన షరతులన్నీ ఒబామాకు ఖచ్చితంగా సరిపోతున్నాయి. కనుక ఆయన ఆ ఉద్యోగానికి అర్హుడేనని పలువురు వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ కంపెనీ లెక్కేంటో చూద్దాం.
 
10 ఏళ్ల క్రిందట ప్రారంభించబడిన స్పోటిఫై లైవ్ స్ట్రీమింగ్ మ్యూజిక్ ఆపరేట్ చేస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో ఇది సేవలందిస్తోంది. స్వీడన్ దేశంలో ప్రారంభించబడిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20 చోట్ల ఉంది. ఇందులో 1600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఇలా మొత్తమ్మీద మ్యూజిక్ స్ట్రీమింగ్ లో తనదైన స్టయిల్లో దూసుకెళుతోంది. మరి ఒబామా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ చేరితే 1600 మంది ఉద్యోగుల్లో ఆయన ఒకరవుతారు.

వెబ్దునియా పై చదవండి