విమానం బయల్దేరేందుకు ముందు.. నల్ల మేకపోతును బలిచ్చారు.. ఎక్కడో తెలుసా?

మంగళవారం, 20 డిశెంబరు 2016 (09:20 IST)
విమానం బయలుదేరేందుకు ముందు మేకపోతును బలిచ్చారు. ఇదేంటి? దైవానుగ్రహం కోసం బలులు ఇవ్వడం అడపాదడపా చూస్తుంటాం. కానీ విమానం బయల్దేరేందుకు ముందు మేకపోతును బలివ్వడం కొంత ఆశ్చర్యానికే గురిచేస్తుంది. ఇది ఎక్కడ జరిగిందంటే..? దాయాది దేశమైన పాకిస్తాన్‌లో. పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ) ఇదే పని చేసింది. 
 
విమానాశ్రయం రన్‌వైపైనే ఒక నల్ల మేకను బలిచ్చి ఏటీఆర్-42 విమానం బయలుదేరడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బలితంతు పూర్తికాగానే విమానం ఆకాశంలోకి ఎగిరి షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ బయలుదేరింది. ఆదివారంనాడు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పీఐఎ అధికారిని ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. ఈనెల 7న పీఐఏకు చెందిన పీకే-661 విమానం హవేలియన్ సమీపంలో కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న పాప్ గాయకుడు, ఇస్లామిక్ ప్రీచర్ జునైద్ జంషెద్ సహా 47 మంది దుర్మరణం పాలయ్యారు.
 
ఈ నేపథ్యంలో ఏటీఆర్-42 విమానాలకు క్షుణ్ణంగా పరీక్షలు జరిపిన అనంతరమే రంగంలోకి దింపేందుకు నిశ్చయించుకున్న పీఐఏ...మేక బలి తంతు కానిచ్చేసింది. అయితే మేక బలి వ్యవహారం మేనేజ్‌మెంట్ స్థాయి నిర్ణయం కాదని అధికారులు వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి