కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా .. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపు

గురువారం, 15 అక్టోబరు 2020 (12:44 IST)
చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇందులోభాగంగానే ఇండోచైనా సరిహద్దులకు భారీ సంఖ్యలో బలగాలను తరలించింది. ఇప్పటికే 60 వేల బలగాలను తరలించినట్టు అమెరికా రక్షణ మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైనిక బలగాలకు ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. 
 
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం గ్వాంగ్డాంగ్ రక్షణ స్థావరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అక్కడి సైనికులకు పిలుపునిచ్చారు. దేశానికి విధేయంగా పని చేయాలని కోరారు. 
 
మీ పూర్తి శక్తిసామర్థ్యాలను యుద్ధంపైనే కేంద్రీకరించాలని, మీ మనసును సైతం యుద్ధం వైపే నడిపించాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిన్‌పింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు విదేశీ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.
 
ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
ప్రస్తుతం పొరుగుదేశం భారత్‌తో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఆయన చేసిన భారత్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసివుంటారని అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా కథనాలు ప్రసారం చేస్తోంది. ఇదేసమయంలో దక్షిణ చైనా సముద్రం విషయంలో పలు దేశాలతో కూడా చైనాకు విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా, తైవాన్‌తో ఆ దేశం నిత్యం ఘర్షణపడుతూనే వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు