నిజానికి అధ్యక్ష పీఠం కోసం హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్‌లు తలపడుతున్నారు. దీంతో వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ పార్టీల తరపున అభ్యర్థులుగా ఖరారు కాకముందే వీరిద్దరూ పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో తమ పార్టీల నుంచి అధికారిక అభ్యర్థులుగా ఖరారైన తర్వాత వారు తమ మాటల దాడులను మరింతగా పెంచారు.
ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన నల్లజాతి, హిస్పానిక్ పాత్రికేయుల జాతీయ సంఘాల సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా హిల్లరీ నాలిక స్లిప్పయ్యింది. 'నా హస్బ్... నా ప్రత్యర్థి మాట్లాడుతున్న దాని గురించి నేను చెప్పేదాన్ని పోల్చి చూస్తారని ఆశిస్తున్నాను' అని హిల్లరీ పేర్కొన్నారు. ఈ వాక్యంలోని 'హస్బ్' అన్న పదం వినగానే సభికులు గొల్లుమనగా, హిల్లరీ వెంటనే సర్దుకున్నారు.