అగస్టా స్కామ్‌లో ఓ మిస్టరీ వుమెన్.. ఆమె ఎవరు..? వారితో విదేశ ట్రిప్పులేసిందట!

శనివారం, 7 మే 2016 (16:06 IST)
అగస్టా స్కామ్‌లో ఓ మిస్టరీ మహిళ కోసం భారత ప్రభుత్వ దర్యాప్తు విభాగాలు విచారిస్తున్నాయి. ఈ స్కామ్‌లో మధ్య దళారీ క్రిస్టియన్ మైకేల్ కోసం వెతుకుతున్న భారత సర్కారు.. ఈ స్కామ్ వెనుక చక్రం తిప్పిన ఓ మిస్టరీ మహిళ గురించి వివరాలు సేకరిస్తున్నాయి. ఆ మహిళపేరు క్రిస్టిన్‌‍ స్ప్లీడ్. ఈమె లండన్‌లో ఉంటుందని తెలిసింది. 
 
ఈమెకు అగస్టా కుంభకోణానికి సంబంధాలున్నాయని, అగస్టా కీలక నిందితులతో ఆమె విదేశ ట్రిప్పులేసిందని సమాచారం. అలాంటి ఒక ట్రిప్పులో ఆమె అగస్టా కేసులో దళారీగా వ్యవహరించారని భావిస్తున్న న్యాయవాది గౌతం ఖైతాన్‌తో కలిసి భారత్ నుంచి స్విట్జర్లాండ్‌కు ప్రయాణించారని తెలిసింది. 
 
2010 ఫిబ్రవరి 8న హెలికాప్టర్ల ఒప్పందంపై సంతకాలు జరిగేందుకు ముందు భారత్‌కు వచ్చిన క్రిస్టిన్ ఆ తర్వాత వారం రోజులకు దుబాయ్ వెళ్లి మైకేల్‌ను కూడా కలుసుకున్నారని సమాచారం. ఇంకా చెప్పాలంటే.. ఇటలీ కోర్టు అగస్టాపై ఇచ్చిన తీర్పుకు తర్వాత ఆమె అదృశ్యమైందని సమాచారం.

వెబ్దునియా పై చదవండి