ఇవాంకా కోసం 30 రకాల నోరూరించే వంటకాలు...

గురువారం, 23 నవంబరు 2017 (08:41 IST)
ఈనెల 28, 29 తేదీల్లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు హైదరాబాద్ వేదికకానుంది. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో సహా దాదాపు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఇవాంకా ట్రంప్ ప్రారంభిస్తారు. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చే ఇవాంకాకు వివిధ రకాల నోరూరించే వంటకాలను వడ్డించనున్నారు. 
 
ఇలాంటివాటిలో ముఖ్యంగా, హలీం.. బిర్యానీ.. షీక్‌ కబాబ్‌.. మటన్‌ మరగ్‌.. మొగలాయి చికెన్‌.. ఖుర్భానీ కా మీఠా.. డ్రైఫ్రూట్స్‌ ఖీర్‌‌లాంటి 30 రకాల నోరూరించే రుచులను ఇవాంకా ట్రంప్‌ కోసం సిద్ధం చేస్తున్నారు. ఇవాంకా మెచ్చే అమెరికన్‌ టేస్టీ రుచులతో పాటు 18 హైదరాబాదీ స్పెషల్‌ ఐటమ్స్‌‌‍ను కూడా తయారు చేస్తున్నారు. 
 
ఇవాంకాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి విందు(డిన్నర్‌)ను ఏర్పాటు చేసింది. తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని చారిత్రక 101 డిన్నర్‌ టేబుల్‌పై ప్రత్యేకమైన హైదరాబాదీ రుచులు వాహ్‌ అనిపించనున్నాయి. వంటకాల తయారీపై ఇప్పటికే దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏరికోరి ముడిసరుకులు.. దినుసులు, మసాలాల సేకరణ చేపట్టారు. వంటకాల తయారీకి నలభీములనదగ్గ చెఫ్‌లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. 
 
ఇవాంకా.. మజాకా..: తాజ్‌ ఫలక్‌నుమాలో విందు ఏర్పాట్ల కోసం ఇవాంకా వ్యక్తిగత ఫుడ్‌ అండ్‌ బేవరెజ్‌ సిబ్బంది, చెఫ్‌ అండ్‌ మెనూ కమిటీలోని 8 మంది సభ్యులతోపాటు.. ఫలక్‌నుమా చెఫ్‌ల సమన్వయంతో హైదరాబాదీ, అమెరికన్‌ స్టాటర్స్‌ వంటకాలు తయారు చేస్తారు. అమెరికా సిబ్బంది ఐదు రోజుల ముందుగానే నగరానికి చేరుకోనుంది. వంటకాల్లో వినియోగించే దినుసులు నిల్వ చేసిన స్టోర్‌ను అమెరికా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకోనున్నారు.
 
ఈ వంటకాలను ఒక రోజు ముందుగా సిబ్బంది ప్రయోగాత్మకంగా తయారుచేసి రుచి చూడనున్నారు. ఎందులో కారం తగ్గించాలి.. ఎందులో పులుపు.. ఉప్పు పెంచాలి.. స్టాటర్స్‌లో ఏ మోతాదులో నెయ్యి, మసాలా దినుసులు వాడాలో నిర్ణయిస్తారు. స్వీట్స్‌లో కూడా ఎంత మోతాదులో షుగర్‌ వేయాలి.. స్వీట్స్‌లో వెన్న, క్రీమ్‌ ఎంత వేయాలో కూడా వారు నిర్ణయిస్తారు. ఈ నెల 28న వంటకాలన్నీ సిద్ధంచేస్తారు. విందుకు గంట ముందు ఫుడ్‌ టెస్టింగ్‌ కమిటీ సిబ్బంది అన్ని వంటకాలనూ రుచి చూస్తారు. ప్రతి వంటకాన్ని కొంత మొత్తంలో ప్యాక్‌ చేస్తారు. ఫుడ్‌లో ఏదేని అలర్జీ కారకం ఉన్నా.. ఏదేని ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మజీవులున్నట్లు భావిస్తే ప్రయోగశాలకు పంపించేందుకే ఫుడ్‌ను ప్యాక్‌ చేస్తారు.
 
హైదరాబాదీ స్టాటర్స్‌ అయిన హలీం, మరగ్, షీక్‌కబాబ్‌తో పాటు నాన్‌ రోటీ, రుమాలీ రోటీ, పరాటా వడ్డిస్తున్నారు. దీంతో పాటు మటన్‌ కోఫ్తా, గ్రిల్డ్, మొగలాయి మటన్, చికెన్‌ డిషెస్, బగారా బైగన్, చికెన్, మటన్‌లో మరో మూడు ఫ్లాటర్స్‌ ఐటమ్స్‌ వండి వడ్డించనున్నారు. స్వీట్స్‌లో హైదరాబాదీ స్పెషల్‌ ఖుర్భానీకా మీఠా, డైఫ్రూట్స్‌ ఖీర్‌ వడ్డిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు