ప్రపంచాన్ని భయపెడుతున్న 'నవంబర్-15'.. అసలు నిజంగా ఏం జరగబోతుంది?

గురువారం, 27 అక్టోబరు 2016 (11:38 IST)
నవంబర్ 15వ తేదీ ప్రపంచాన్ని భయపెడుతోంది. నిన్నామొన్నటి వరకు భూమి అంతమవుతుందంటూ ప్రచారం జరిగింది. ఇపుడు 15 రోజుల పాటు సూర్యకాంతి భూమిపై పడబోదంటున్నారు. సాక్షాత్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) పేరుతో వైరల్ అవుతున్న ఓ వార్త ఇప్పుడు భూదేవిని నమ్ముకున్న మనుషులను కలవరపాటుకు గురిచేస్తోంది. 
 
నవంబర్‌లో పక్షం రోజులపాటు భూమిని చీకట్లు కమ్మేస్తాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నవంబర్ 15 నుంచి 29 వరకు భూమి చీకటిమయం అవుతుందని, దీనికి సంబంధించిన సమాచారంపై అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నాసా చీఫ్ 1000 పేజీల రిపోర్టును కూడా సమర్పించాడని ‘ది బోర్‌డ్ మైండ్’ వెబ్‌సైట్ 8 రోజుల క్రితం ఓ కథనం ప్రచురించింది. ఈ ఆసక్తికర కథనంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతుంటే.. ప్రజలు మాత్రం భయం గుప్పెట్లో ఉన్నారు.  
 
కాగా, ఆ వెబ్‌సైట్ కథనం ప్రకారం... ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 30 వరకూ 15 రోజుల పాటు భూమి చీకట్లోకి వెళుతుందట. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారని ఆ వెబ్‌సైట్ ప్రచురించింది. నవంబర్ ‘బ్లాక్ అవుట్‌’గా పిలిచే ఈ ఉత్పాతం నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4.45 వరకూ ఉంటుందని పేర్కొంది. 
 
సౌర వ్యవస్థలో శుక్రగ్రహం, గురుగ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాల వల్లే ఈ బ్లాకవుట్ సంభవిస్తుందని శాస్త్రవేత్తలు ఓ స్పష్టతకు వచ్చారట. శుక్రుడు, గురుడు పరస్పరం చాలా దగ్గరగా వస్తాయని, అప్పుడు వాటిమధ్య ధ్రుక్కోణం కేవలం ఒక డిగ్రీ మాత్రమే ఉంటుందని, ఈ సమయంలో గురుగ్రహం నైరుతిదిశగా శుక్రుడు అధిగమించి గురుడికన్నా 10 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా మారుతాడట. 
 
ఈ చర్యవల్ల శుక్రుడిలో వేడిపెరిగి వాయువులు విడుదలవుతాయట. దీంతో సౌరవ్యవస్థలో ఇంతకుముందెప్పుడూ లేనంతగా హైడ్రోజన్ వాయువు అలుముకుంటుందట. దీంతో సౌరవ్యవస్థకు లయకారకుడైన సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఒక్కసారిగా 9000 డిగ్రీల కెల్విన్‌కు చేరుకుంటుందట. నవంబర్ 15 తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుందట. ఈ భరించలేని వేడితో ఎర్రగా ఉండే సూర్యుడు కూడా కాస్త నీలం రంగులోకి మారిపోతాడట. అనంతరం సూర్యుడు యథాస్థితికి రావాలంటే 14 రోజుల సమయం పడుతుందన్నది ఈ కథనం సారాంశంగా ఉంది. అయితే, దీన్ని పెక్కు మంది శాస్త్రవేత్తలు మాత్రం కొట్టిపారేస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి