ఒంటెత్తు పోకడలతో ముస్లిం దేశాలపై నిషేధం, వీసా నిషేధం అంటూ తన పని తాను చేసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు ఉత్తర కొరియా హెచ్చరించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా కానీ వ్యతిరేకంగాకానీ చర్యలు చేపడితే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. వాయు, జల, భూ మార్గాల ద్వారా జాలి, దయ లేకుండా దాడులు చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని ఆ దేశ అధికార న్యూస్ ఏజెన్సీ కేసీఎన్‌ఏ వెల్లడించింది.
దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న డ్రిల్స్ లో భాగంగా నేవి సూపర్ క్యారియర్ 'కార్ల్ విన్సన్' ను యునైటెడ్ స్టేట్స్ మోహరిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా స్పందిస్తూ.. కార్ల్ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని ఉత్తర కొరియా మండి పడింది. మార్చ్ 11న సైతం శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్‌లు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని ఉత్తర కొరియా ఆరోపించింది.