పాకిస్థాన్ దేశంలో వరద బీభత్సం - 937 మంది మృత్యువాత

శుక్రవారం, 26 ఆగస్టు 2022 (15:37 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌ను వరదలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల్లో చిక్కున్న బాధితుల్లో దాదాపు 937 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు కోట్ల మంది వరకు వరద బాధితులు నిరాశ్రయులయ్యారు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 
 
గత జూన్ నెల నుంచి ఈ వర్షాలు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా, ఈ వర్షాలు, వీటివల్ల ఏర్పడిన వరదల వల్ల సింధ్ ప్రావిన్స్‌లోనే ఎక్కువగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 306 మంది ప్రాణాలు కోల్పోగా, బలూచిస్థాన్‌లో 234 మంది చనిపోయారు. 
 
అలాగే, పంజాబ్ ప్రావిన్స్‌లో 165 మంది, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 185 మంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 37 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఒక్క ఆగస్టు నెలలోనే పాక్ దేశంలో ఏకంగా 166.8 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైనట్టు ఆ దేశ జాతీయ విపత్తుల నిర్వహణ విభాగం వెల్లడించింది. నిజానికి సగటున 44 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదుకావాల్సివుండగా, ఏకంగా 241 శాతం పెరిగిందని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు