భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అగ్రరాజ్యం మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు సంధికి సమ్మతించాయి. నిజం చెప్పాలంటే ఈ యుద్ధంలో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. మరికొన్ని రోజుల పాటు భారత్ దాడులు చేస్తే పూర్తిగా నష్టపోతామని భావించింది. అందుకే శరణుజొచ్చింది. అటు అమెరికా, ఇటు భారత్‌లను ప్రాధేయపడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచన మేరకు భారత్ వెనక్కి తగ్గింది. యుద్ధంలో పాకిస్థాన్ భారీగా నష్టపోయినా కాళ్లబేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకుంది. అయినప్పటికీ ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌కు బుద్ధిరాలేదు.
శనివారం యుద్ధం ముగిసిన తర్వాత ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో నమ్మశక్యంకాని, నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, శత్రువులు ఎయిర్ బేస్‌లు, స్థావరాలను టార్గెట్ చేసి, వాటిని ధ్వంసం చేశాము. వారి రాఫెల్ యుద్ధ విమానాన్ని నేలకూల్చాం. మేమే విజయం సాధించాం. ఇది పాకిస్థానీల విజయం, పాకిస్థానీ ఆర్మీ, చైనా, టర్కీ, ఇతర ముస్లిం దేశాలకు మా కృతజ్ఞతలు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నా ధన్యవాదాలు" అని అన్నారు.
కాగా, యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మౌనంగా ఉంటే ఈ యుద్ధంలో చావుదెబ్బతిన్న పాక్ మాత్రం తామే గెలిచామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. పాక్ ప్రధాని ప్రసంగం తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న భారతీయ నెటిజన్లు పలువురు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం కుక్క తోక వంకర అన్న చందంగా పాక్ వంకర బుద్ధి మారదంటూ సెటైర్లు వేస్తున్నారు.