మొక్కజొన్న చేనులో దిగిన రష్యా విమానం.. ప్యాసింజర్స్ సేఫ్

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (11:55 IST)
రష్యాకు చెందిన విమానమొకటి అత్యవసరంగా మొక్కజొన్న చేనులో ల్యాండ్ అయింది. అయితే, ఇందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాస్కోలోని ఝుకోవ్‌స్కీ విమానాశ్రయం నుంచి క్రిమియాలోని సింఫర్‌పూల్‌కు బయలుదేరిన ఎయిర్‌బస్ విమానం ఏ321ను టేకాఫ్ అయిన సెకన్లలోనే పక్షులను ఢీకొట్టాయి. దీంతో విమానం రెండు ఇంజిన్లు పనిచేయకపోవడంతో పైలట్ విమానాశ్రయానికి ఐదు కి.మీ. దూరంలోని మొక్కజొన్న చేనులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. 
 
ప్రమాద సమయంలో విమానంలో 226 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండింగ్ కాగానే గాలితో నింపిన ర్యాంప్‌ల సాయంతో ప్రయాణికులను కిందకు దించేశారు. రష్యా ప్రభుత్వ విమానయాన సంస్థ అధిపతి అలెగ్జాండర్ నెరాడ్కో మీడియాతో మాట్లాడుతూ విమాన సిబ్బంది సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిట్రీ పెస్కోవ్ స్పందిస్తూ.. విమాన పైలట్లను అభినందించారు. వారు జాతి హీరోలు అని అభివర్ణించారు. త్వరలో వారు ప్రభుత్వ పురస్కారాలను అందుకుంటారని వెల్లడించారు. 
 
కాగా, ఈ విమానం జుకోవ్ స్కీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కిలోమీటర్ దూరంలో ఎయిర్ బస్ 321 అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రష్యా వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు