టాంజానియా తొలి మహిళా అధ్యక్షురాలిగా సామియా

శనివారం, 20 మార్చి 2021 (09:39 IST)
టాంజానియా తొలి మహిళా అధ్యక్షురాలిగా సామియా సులుహు హసన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ముఖానికి ముసుగు ధరించి, కుడి చేత్తో ఖురాన్‌ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసిన ఆమె దేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రతిన చేశారు.

తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణం చేసి సామియా చరిత్ర సృష్టించారు. టాంజానియా మంత్రివర్గ సభ్యులు, ప్రధాన న్యాయమూర్తి, మాజీ అధ్యక్షులు ప్రభృతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కొవిడ్‌ కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్కువమందిని ఆహ్వానించలేదు. బహిరంగంగా కాకుండా లోపలే ఈ కార్యక్రమం జరిగిన అనంతరం మిలటరీ పరేడ్‌ను ఆమె తిలకించారు.
 
టాంజానియా అధ్యక్షుడు జాన్‌ మగుఫులి (61) గుండెకు సంబంధించిన సమస్యలతో మృతి చెందారని ఉపాధ్యక్షురాలు సులుహు హాసన్‌ ప్రకటింటించిన విషయం తెలిసిందే.

 ఈ నెల 6న జకాయ కిక్వేట్‌ కార్డియాక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చగా.. ఆ తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారని, అయితే 14న మరల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

టాంజానియా రాజ్యాంగం ప్రకారం... తదుపరి దేశాధ్యక్షునిగా హాసన్‌ వ్యవహరించాల్సి ఉంటుంది. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మగుపులి గెలిచి రెండవ సారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఈయన మరణంతో మిగిలిన కాలానికి హాసన్‌ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు