చరిత్రలోనే భారీ ఉల్కాపాతం.. ఆగస్టు 12న జీవితంలో అరుదైన దృశ్యం మిస్ కావద్దు

మంగళవారం, 1 ఆగస్టు 2017 (08:27 IST)
రాత్రి పూట కూడా పగలు లాగా కనిపిస్తే భూమికి ఏదో ఉత్పాతం ఊడిపడనుందని భయపడతాం. కాని అది ఉత్పాతం కాదు.. ఉల్కాపాతం ప్రభావమట. బహశా మానవ చరిత్రలోనే అత్యంత భారీ ఉల్కా పాతం ఆగస్టు 12వ తేదీ రాత్రి కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి కూడా పగలు వలె కనిపిస్తుందని పేర్కొన్నారు. దాదాపుగా గంటకు 100 వరకు ఉల్కలు నేలరాలతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దృశ్యాలను చూడగలమని అంటున్నారు. 109పీస్విఫ్ట్‌–టట్టెల్‌ అనే తోకచుక్క నుంచి ఈ ఉల్కలు రాలుతాయని చెప్పారు.
 
ప్రతి ఏడాది జూలై మధ్య నుంచి ఆగస్టు చివరి వరకు ఉల్కలు రాలుతాయనీ, ఆగస్టు మధ్యలో ఓ రెండ్రోజులు ఎక్కువ సంఖ్యలో ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్పా రు. భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఉల్క ల వేగం గంటకు లక్షా ముప్పైవేల మైళ్లు ఉంటుంది. వెంటనే అవి వాతావరణంలోనే మండిపోతాయి కాబట్టి మానవులకు ఏ ప్రమాదమూ ఉండదు.
 
అలాగే.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఓ గ్రహశకలం భూమికి అతిదగ్గరగా రాబోతోంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేనప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ సంఘటనను ఒక అవకాశంగా మలుచుకుంటోంది. భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను పసిగట్టేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. విశ్వం నుంచి నిత్యం అనేకానేక గ్రహశకలాలు దూసుకొస్తూంటాయని.. కొన్ని భూమికి దగ్గరగా వెళతాయని మనందరికీ తెలుసు. వీటిని గమనించేందుకు నాసా ఆధ్వర్యంలోని ప్లానెటరీ డిఫెన్స్‌ కో ఆర్డినేషన్‌ ఆఫీస్‌ పనిచేస్తోంది. 
 
తాజాగా 2012 టీసీ4 అని పేరు పెట్టిన ఓ గ్రహశకలం భూమికి కేవలం 6,800 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుంది. ఈ గ్రహశకలాన్ని తాము 2012లోనే గుర్తించామని అయితే అప్పట్లో ఇది వారం రోజుల పాటే పరిశీలనలకు అందుబాటులో ఉందని అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్త విష్ణురెడ్డి తెలిపారు. ఇప్పుడు దీన్ని మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.
 

వెబ్దునియా పై చదవండి