అమెరికా, ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్‌లకు మధ్యవర్తిగా ఉండటానికి తమకెలాంటి ఇబ్బందీ లేదని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి అత్తార్ అబ్బాస్ స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ తాలిబన్ నేతలతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని.. అమెరికా కోరితే.. వారిని చర్చలకు ఒప్పించగలమని అత్తార్ తెలిపారు.
ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ మాట్లాడుతూ, అమెరికా చర్చలు జరపాలని కోరితే.. తాలిబన్లను తాము తీసుకువస్తామన్నారు. అయితే తాలిబన్లతో సంబంధాలున్న కారణంగా వారికి సైనిక, ఆర్థిక సహాయం చేయడం లేదని స్పష్టం చేశారు.
ఇతర సంస్థలతో కనీస సంబంధాలను కలిగి ఉండాలనే ఉద్ధేశ్యంతోనే ఈ సంబంధాలున్నట్లు తెలిపారు. కానీ, అమెరికా, తాలిబన్‌లకు మధ్యవర్తిత్వం వహించినందుకు గాను ప్రతిఫలంగా భారత్‌తో తమకున్న సమస్యల విషయంలో తమ పట్ల అమెరికా సానుకూలంగా వ్యవహరించాలని అబ్బాస్ కోరడం గమనార్హం.