అమెరికాలోనూ భూ కబ్జా

భారతదేశంలో భూకబ్జా అనే విషయం తరచూ వింటుంటాం. అందునా ఆంధ్రప్రదేశ్‌లో అయితే మరీ ఎక్కువ. కాని ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలోకూడా భూకబ్జాల బెడద తప్పడం లేదు.

మన భారతదేశంలోలాగే అమెరికాలోని శ్మశాన వాటిక స్థలాలను తిరిగి అమ్మి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని అక్కడి అధికారవర్గాలు వెల్లడించాయి.

వివరాలలోకి వెళితే...చికాగోకు దక్షిణంగా ఉన్న అల్సిప్‌లోని బరోక్‌ శ్మశాన వాటికలోనున్న 200 నుంచి మూడు వందల సమాధుల వరకు, ముఖ్యంగా ఆఫ్రికన్‌-అమెరికన్ల సమాధులను తవ్వేశారు.

ఇందులో భాగంగా ఒక మేనేజర్‌, సమాధులు తవ్వే ముగ్గురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ సమాధులను తవ్వి, వాటిని పాట్లుగా చేసి అమ్మే ప్రక్రియ గత కొన్ని ఏళ్లుగా సాగుతోంది.

ఇలాంటి స్థలాలగురించి పెద్దగా తెలియనివారికే ఈ ప్లాట్లను అమ్ముతున్నారని టామ్‌ డార్ట్‌ ఒక నివేదికలో వెల్లడించారు. పురాతనమైన శ్మశాన వాటికలు, జనాల సందడి లేని వాటిని ఎన్నుకుని కొందరు వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.

అంత్యక్రియల కోసం సిద్ధం చేసిన స్థలంలో సమాధులు తవ్వే వ్యక్తులు వాటిని చదును చేసి అమ్ముకుంటున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రముఖుల సమాధులుకూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ప్రక్రియలో మూడు లక్షల అమెరికన్‌ డాలర్లు చేతులు మారినట్లు సమాచారం. ముఖ్యంగా ఆఫ్రికన్‌-అమెరికన్ల సమాధులపై దుండగులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి