ఈజిప్ట్ రాజధాని కైరోలో నిర్వహించనున్న అలీన శిఖరాగ్ర సమావేశాలకు పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ గైర్హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉగ్రవాదంపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ సమాజం ముందు జర్దారీని ముఖాముఖీగా ప్రశ్నించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అంతకుముందు రష్యాలో ఇటీవల జీ -8 బ్రిక్ దేశాల సదస్సు, అలాగే తాజాగా ఇటలీలో జీ-8, జీ-5 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులు సందర్భంగా హాజరైన మన్మోహన్ ఉగ్రవాదంపై పాక్ వైఖరిని స్పష్టం చేయాలని.. అలాగే ఉగ్రవాద అణచివేతలో నిజాయితీగా వ్యవహరించాలని పాక్ అధ్యక్షుడు జర్దారీని ముఖాముఖిగా డిమాండ్ చేశారు.
అంతేకాకుండా.. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే పాక్‌తో సన్నిహిత సంబంధాలు సాధ్యమవుతాయని మన్మోహన్ కరాఖండీగా చెప్పేశారు. దీంతో త్వరలో షెడ్యూల్ ప్రకారం జరుగనున్న అలీన సమావేశాల్లో జర్దారీ పాల్గొనే విషయమై అస్పష్టత నెలకొంది. అయితే.. వ్యక్తిగత కారణాలతోనే జర్దారీ అలీన సమావేశాలకు వెళ్లడం లేదని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం.