ఆఫ్ఘనిస్థాన్‌లో చేస్తున్న యుద్ధానికి మద్దతు కూడగట్టేందుకు బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ ఆరాటపడుతున్నారు. ఈ యుద్ధం విషయంలో బ్రిటన్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు బ్రౌన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేప్టటింది. ఆఫ్ఘనిస్థాన్‌లో గత కొన్నేళ్లుగా బ్రిటన్ సైనికులు కూడా తీవ్రవాదులతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.
అయితే అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఏళ్ల తరబడి ఆఫ్ఘనిస్థాన్‌లో చేస్తున్న యుద్ధంపై బ్రిటన్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన తీవ్రవాద దాడుల్లో ఎనిమిది మంది బ్రిటన్ సైనికులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఆఫ్ఘన్ యుద్ధంలో మృతి చెందిన బ్రిటన్ సైనికుల సంఖ్య 184కు చేరింది.
ఇరాక్‌లో అల్‌ఖైదా, దాని అనుబంధ సంస్థలపై సాగించిన యుద్ధం కంటే ఆఫ్ఘన్ యుద్ధంలోనే ఎక్కువ మంది సైనికులు మృతి చెందారు. తాజాగా బీబీసీ సహకారంతో గార్డియన్ వార్తాపత్రిక చేసిన సర్వేలో ఆఫ్ఘనిస్థాన్ యుద్ధానికి మద్దతు ఇస్తున్నవారి సంఖ్య, వ్యతిరేకిస్తున్నవారి సంఖ్యకు దగ్గరగానే ఉంది.
ఐసీఎస్ సర్వే వివరాల ప్రకారం.. ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటన్ జోక్యానికి మద్దతు ఇస్తున్నవారి సంఖ్య 46 శాతానికి పెరిగింది. వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 47 శాతం వద్ద ఉంది. 2006లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఈసారి మద్దతు ఇస్తున్నవారి సంఖ్య 15 పాయింట్లు పెరిగింది.