ఇంటిముఖం పట్టిన స్వాత్ లోయ పౌరులు

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక స్వాత్ లోయలో ఆ దేశ సైన్యం చేపట్టిన ఆపరేషన్ కారణంగా ప్రాణభయంతో కొన్నివారాల క్రితం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన బాధితులు ఇప్పుడు సొంతగూటికి తిరిగివెళుతున్నారు. స్వాత్ లోయలోని కొన్ని ప్రాంతాలకు నిరాశ్రయులైనవారు సోమవారం తిరిగి వస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.

తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు గత కొన్నివారాలుగా నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టింది. ఈ సైనిక చర్య కారణంగా వేలాది మంది పౌరులు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు తరలివెళ్లారు. అనేక మంది శరణార్థ శిబిరాల్లో తలదాచుకున్నారు. శిబిరాల్లోని పౌరులను పాక్ ప్రభుత్వం వాహనాల్లో తిరిగి వారి సొంత ప్రదేశాలకు తరలిస్తోంది.

ఏప్రిల్‌లో తాలిబాన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్న బునెర్ జిల్లాకు పొరుగునున్న నౌషెరా, చార్సడ్డా జిల్లాల్లో వేలాది మంది పౌరులు శరణార్థులుగా క్యాంపుల్లో జీవనం గడిపారు. వీరిని ప్రస్తుతం పాక్ ప్రభుత్వం వారి సొంత ఊళ్లకు తీసుకెళుతోంది. ఇప్పటివరకు 108 కుటుంబాలను సొంత ప్రదేశాలకు చేర్చినట్లు నౌషరా జిల్లా అధికారి ఒకరు తెలిపారు. శిబిరాల్లో ఉంటున్న చాలా మంది పౌరులు సొంత ప్రదేశాలకు ఇప్పుడే వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి