ఇజ్రాయేల్‌తో వ్యాపారానికి బ్రిటన్ పాక్షిక చెక్

ఇజ్రాయేల్‌తో ఆయుధాల వ్యాపారంపై బ్రిటన్ ప్రభుత్వం పాక్షికంగా నిషేధం విధించింది. ఓ వార్తాపత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. ఇజ్రాయేల్ మిలిటరీ గాజా ప్రాంతంలో యుద్ధం చేస్తున్న కారణంగా బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆయుధాల వ్యాపారంపై విధించిన పాక్షిక నిషేధంలో భాగంగా ఇజ్రాయేల్ నేవీ గన్‌షిప్‌లలో ఉపయోగించే విడిభాగాలు సరఫరా చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించినట్లు తెలుస్తోంది. బ్రిటన్ విదేశాంగ శాఖ ఈ సమాచారాన్ని లండన్‌లోని ఇజ్రాయేల్ దౌత్యకార్యాలయానికి తెలియజేసింది.

ఈ ఆంక్షలు కొన్ని రోజుల క్రితమే అమల్లోకి వచ్చాయి. గాజాలో ఇజ్రాయేల్ యుద్ధం కొనసాగిస్తుండటంపై బ్రిటన్ మానవహక్కుల సంస్థలు, ఎంపీల ఒత్తిడి తేవడంతో బ్రిటన్ విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని హారెట్జ్ వార్తాపత్రిక వెల్లడించింది.

ఇజ్రాయేల్‌కు ఆయుధాల ఎగుమతికి సంబంధించిన 182 లైసెన్స్‌లను బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల సమీక్షించింది. మొదట అన్ని లైసెన్స్‌లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ, చివర్లో ఐదు లైసెన్స్‌లను మాత్రం రద్దు చేసింది.

ఇజ్రాయేల్ సార్ 4.5 మిస్సైల్ బోట్లకు విడిభాగాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ఈ ఐదు లైసెన్స్‌లను బ్రిటన్ ప్రభుత్వం నిలిపివేసింది.

వెబ్దునియా పై చదవండి