ఉగ్రవాద మూలాలు పాక్‌లోనే: జర్దారీ

ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న ఉగ్రవాద మూలాలు పాకిస్థాన్ దేశంలోనుంచే పుట్టుకొచ్చాయని ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఎట్టకేలకు బుధవారం హుందాగా అంగీకరించారు.

స్వల్పకాలిక ప్రయోజనాలకోసమే పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆయన అన్నారు. తమ దేశంలో ఉగ్రవాదం పెచ్చుమీరడంతో పాలనాపరమైన వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాలిబన్ తదితర తీవ్రవాద శక్తులను మట్టుబెట్టేందుకు, వారితో పోరాడేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు రావాలని, దేశ సౌభాగ్యంకోసం అందరు ఒకత్రాటిపై రావాలని ఆయన పిలుపునిచ్చారు.

గతంలో అమెరికాలో జరిగిన 9/11 సంఘటన ఆ దేశ ప్రజలనేకాక యావత్ ప్రపంచాన్నే గడగడలాడించిందని ఆయన తెలిపారు. ఈ సంఘటన అమెరికా ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉందని, వారు నిత్యం భయం గుప్పిట్లో ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఇదిలావుండగా పాకిస్థాన్‌లోని పెషావర్‌లోనున్న నాసిర్‌బాగ్‌‌‌ రోడ్‌లో ఓ మానవబాంబు పేలింది. బుధవారం నాడు జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం.

కాగా సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే దానిపై ఏ తీవ్రవాద సంస్థకూడా ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై తాము విచారణ చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి