చైనాలో మరోమారు భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం పెద్దగా లేకపోగా, ఒక్కరు మాత్రం మృతి చెందారు. అయితే, ఆస్తినష్టం మాత్రం తీవ్రస్థాయిలో ఉంది. శిథిలాల కింద చిక్కుకుని 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
నైరుతి చైనాలోని యువాన్ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించినట్టు చైనా అధికార వార్తా సంస్థ జిన్హూవా శుక్రవారం వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. సుమారు వెయ్యి మందికి పైగా సైనికులు, పోలీసు అధికారులు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైవున్నట్టు తెలిపింది.
పక్కనేవున్న సిచువాన్ ప్రావిన్స్ నుంచి వందలాది ప్రజలు తరలి వచ్చి భూకంప బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, యాన్ సహా ఇతర ప్రాంతాల్లో భూకంపం దాటికి 18 వేలకు పైగా గృహాలు పూర్తిగా కూలిపోగా, 75 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు.