పాప్ సంగీత సమ్రాజ్యాధిపతి మైఖేల్ జాక్సన్ మరణానికి ముందు శక్తివంతమైన బాధానివారణ మందులను (పెయిన్‌కిల్లర్లు), మాత్రలను ప్రాణాంతక స్థాయిలో ఇచ్చివుండవచ్చని టాక్సికాలజీ విభాగం ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.
టాక్సికాలజీ విభాగం తెలిపిన వివరాలనుబట్టి చూస్తే మైఖేల్ జాక్సన్ హత్యకు గురై ఉండవచ్చన్న అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది.
గతంలో జాక్సన్ రెండు మూడు రకాల శక్తివంతమైన మందుల్ని తీసుకునేవారు. ఆ మందులకు మరో వ్యక్తి అయితే వెంటనే మరణించేవాడు. కానీ ఆయన చాలాకాలం నుంచి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటుండడం వల్ల మైఖేల్ శరీరం ఆ శక్తివంతమైన మందులకు కూడా అలవాటు పడిపోయింది. జాక్సన్ శవపరీక్షల ప్రాథమిక నివేదికల్ని పేర్కొంటూ బ్రిటిష్ పత్రిక ‘సన్’ ప్రచురించింది.
ఆ నివేదికను లాస్‌ఏంజిల్స్ కౌంటీలోని శవపరీక్షల కార్యాలయానికి పంపించారు. 'డెమెరాల్' అనే మత్తు పదార్థంతోపాటు జాక్సన్ హెరాయిన్‌కు ప్రత్యామ్నాయంగా భావించే 'మెథడాన్'ను అతను ఉద్వేగానికి లోనుకాకుండా చేసే 'జెనాక్స్' అనే మరో డ్రగ్‌ను కూడా ఎక్కువ మోతాదులో జాక్సన్‌కు ఇచ్చినట్లు రక్తపరీక్షల్లో తేలిందని ఆ నివేదికలో వైద్యులు వెల్లడించారు.
రోగికి శస్తచ్రికిత్స చేసేటప్పుడు ఇచ్చే మత్తు మందు 'ప్రొపోఫోల్', చికిత్సానంతరం నొప్పి తెలీకుండా ఇచ్చే 'డిలాడిడ్', 'ఫెంటానైల్'లాంటివాటిని కూడా జాక్సన్ శరీరంలో తక్కువ మోతాదులో ఉన్నాయని తమ పరీక్షల్లో వెల్లడైందని ఆ విభాగం ప్రకటించింది.
ఇదిలావుండగా టాక్సికాలజీ నివేదికను శవపరీక్షల కార్యాలయం విడుదల చేయాల్సి ఉంది. అది విడుదలైతే కానీ జాక్సన్ మరణానికి అసలు కారణం తెలియదు.
కాగా తాము నిర్వహించే దర్యాప్తు ముందుకు సాగడానికి టాక్సికాలజీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టు లాస్‌ఏంజల్స్ పోలీస్ చీఫ్ విలియం బ్రాటన్ తెలిపారు.