ఆఫ్గనిస్థాన్‌లో అమెరికా, ఆఫ్గన్ సైన్యాలు కలిసి అక్కడ నివాసమేర్పరచుకుని ఉన్న తాలిబన్లను తరిమికొట్టారని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు. కాని ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చివరివరకు పోరాడుతామని ఆయన తెలిపారు.
ఒబామా తన ఘానా పర్యటన సందర్భంగా ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వేసవి కాలంలో వారిపై పోరాడటం చాలా కష్టమని తమకు తెలుసునని, అయినాకూడా ఇరువర్గాల సైన్యం ఎంతో శ్రమించి ఉగ్రవాదంపై పోరాడి తాలిబన్లను తరిమికొట్టిందని, అయితే ఇంకా పోరాడాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా ఆఫ్గనిస్థాన్‌లో రానున్న ఆగస్టునెల 20న అధ్యక్షుని ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలనంతరం అక్కడి పరిస్థితిని సమీక్షించాల్సివుందని ఆయన తెలిపారు.
కాగా ఆఫ్గనిస్థాన్‌లోని పరిస్థితిని పూర్తిగా చక్కబెట్టేందుకు తీసుకోవలసిన మరిన్ని జాగ్రత్తలపై తాము కొత్తగా ఎన్నిక కాబోయే ఆఫ్గనిస్థాన్ అధ్యక్షునితో చర్చిస్తామని ఆయన అన్నారు. తాము తీసుకోబోయే మార్పుల్లో సైన్యం పరంగా కాకుండా ఆఫ్గనిస్థాన్‌ను అభివృద్ధిపరిచే దిశలో తమ చర్చలుంటాయని ఆయన పేర్కొన్నారు.
అమెరిరాకాకు ఇంకా బ్రిటిష్ సైన్యంతో అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అమెరికా మరియు బ్రిటన్ సైన్యం ఆఫ్గగనిస్థాన్‌లోని హేల్‌మంద్ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులను అంతమొందించేందుకు సైన్యం పోరాటం జరిపిన విషయం విదితమే.