పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావీన్స్‌లో ఉన్న ఓ కుగ్రామంలో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు బాలలున్నారు. మరో 70 మంది గాయపడ్డారు. బాంబు పేలుడు తీవ్రతకు గ్రామంలోని మదర్సా పూర్తిగా ధ్వంసమైంది.
ఉపాధ్యాయుని ఇంటిలో దాచివుంచిన పేలుడు పదార్థాలు విస్ఫోటనం చెందడంతో మదర్సా, అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దక్షిణ పంజాబ్‌లోని మియాన్ చాను సమీపంలోని గ్రామంలో ఈ బాంబు పేలుడు సంభవించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. అకస్మాత్తుగా శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ఇళ్ల శిథిలాల కిందపడి ఎక్కువ మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. శిథిలాల తొలగించేందుకు చేపట్టిన చర్యలు కొనసాగుతున్నాయి. మియాన్ చాను సమీపంలోని ఆస్పత్రులన్నీ బాంబు పేలుడు క్షతగాత్రులతో నిండిపోయాయి.